హాజరైన ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు
హైదరాబాద్ – కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన కమిషన్ శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. ముగ్గురు ప్రతినిధులను విచారించింది కమిషన్.
నిర్మాణం, నాణ్యత, బ్లాక్ 7 కుంగుబాటుపై వరుసగా ప్రశ్నలు సంధించారు కమిషన్ చైర్మన్. నిర్మాణంలో నాణ్యత పాటించారా? అని కమిషన్ ప్రశ్నించింది.
క్వాలిటీ కంట్రోల్ వంద శాతం పాటించామని సమాధానం ఇచ్చారు సంస్థ ప్రతినిధులు. నిర్మాణంలో నాణ్యత పాటిస్తే బ్లాక్ 7 ఎలా కుంగిందంటూ నిలదీసింది. ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారేజీ మొట్టమొదటి డ్యామేజ్ ఎప్పుడు జరిగిందని కమిషన్ చైర్మన్ ప్రశ్నించారు.
2019లో మొదటిసారి డ్యామేజ్ గుర్తించామని, ఆ వెంటనే సమస్య పరిష్కరిస్తే ఇంతటి డ్యామేజ్ అయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగడానికి గల కారణాలపై రీసెర్చ్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని తెలిపారు ఎల్ అండ్ టీ ప్రతినిధులు.
కేసీఆర్ సారథ్యంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు చేసి నిర్మించింది కాలేశ్వరం ప్రాజెక్టును. భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.