DEVOTIONAL

వైభవంగా లక్ష కుంకుమార్చన

Share it with your family & friends

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో
తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది.

హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి అమ్మ వార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మ వారికి ప్రతి రూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది.

అమ్మ వారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయంగా వ‌స్తోంది అనాది నుంచి. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మ వారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు వెల్ల‌డించారు.

ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మ వారిని ఆశీనులను చేసి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్ర నామాలను వల్లిస్తూ అమ్మ వారిని కుంకుమతో అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జేఈవో గౌత‌మి, ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్, పాంచరాత్ర ఆగమ సలహాదారు మ‌ణికంఠ భ‌ట్టర్‌, అర్చకులు బాబుస్వామి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.