అభివృద్ది..సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్
అమరావతి – అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ మొదటి బడ్జెట్ స్వర్ణాంధ్ర సాధన విజన్ 2047 కు తొలిమెట్టు అవుతుందన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయడం భాద్యతగా ఏపీలో పాలన సాగుతుందని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రంలో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
పోలవరం, వెలిగొండ, గాలేరు – నగరి, హంద్రీ – నీవా మొదలగు నీటి వనరుల ప్రాజెక్టుల పూర్తి ద్వారా సాగు, త్రాగు , పారిశ్రామిక అవసరాలు తీర్చే విధంగా సీఎం ప్రయారిటీ ఇస్తున్నారని తెలిపారు.
పోలవరం రాష్ట్ర జీవనాడిగా, వెలిగొండను పశ్చిమ ప్రకాశం జిల్లా జీవనాడిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు లంకా దినకర్.
వెలిగొండ బడ్జెట్ నిధుల కేటాయింపు కోసం సీఎం, మంత్రులకు నివేదికలు ఇవ్వడం జరిగిందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో జగన్ పాలనకు బిన్నంగా పంచాయితీలకు ఆర్థిక సంఘం నిధులు నేరుగా చేర్చడం వల్ల పంచాయితీలు స్వయం సమృద్ధి సాధించేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు.
రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేష్ స్కిల్ సెన్సెస్ ( నైపుణ్య గణన ) కు ప్రాధాన్యత ఇస్తూ యువత నైపుణ్యాలకు పదును పెట్టె పనిలో ఉన్నారని తెలిపారు. పెట్టుబడులు కోసం అయిన చేసిన విదేశీ పర్యటన విజయవవంతం అయ్యిందన్నారు.
రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ కృషితో కేంద్ర ప్రభుత్వం సహాయంతో అమరావతిలో 500 పడకల ఈఎస్ఐ, 150 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లుకు అనుమతి ఇచ్చిందన్నారు, అలాగే 150 అదనపు మెడికల్ సీట్లు సాధించడం అభినందనీయమని అన్నారు లంకా దినకర్.