ఎల్‌కే అద్వానీకి భారతరత్న
ప్రకటించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ – అపర రాజకీయ చాణుక్యుడిగా పేరు పొందిన భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీకి అత్యున్నతమైన భారత పౌర పురస్కారం లభించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ శనివారం కీలక ప్రకటన చేసింది.
ఈ సందర్బంగా ప్రధాని అత్యంత భావోద్వేగంతో అద్వానీకి భారత రత్న ఇస్తున్నట్లు వెల్లడించారు. దీంతో బీజేపీలో సంతోషం వ్యక్తం అవుతోంది. అయోధ్యలో రామ మందిరం కోసం అద్వానీ సారథ్యంలోనే రథ యాత్ర ప్రారంభమైంది.
ఈ సదర్బంగా ఎల్కే అద్వానీకి పౌర పురస్కారం ఇవ్వడం సబబేనని పేర్కొన్నారు. మన కాలంలో అత్యంత గౌరవనీయమైన రాజనీతిజ్ఞులు, దేశ అభివృద్ది కోసం కృషి చేసినందుకు గాను ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
ఈ విషయాన్ని తాను స్వయంగా అద్వానీతో మాట్లాడానని, తాను ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు ప్రధానమంత్రి. ఇదిలా ఉండగా అద్వానీకి అపారమైన రాజకీయ అనుభవం ఉంది. దివంగత వాజ్ పేయ్ ప్రభుత్వంలో అనేక మంత్రిత్వ శాఖలకు నేతృత్వం వహించారు. ఉప ప్రధానమంత్రిగా పని చేశారు.