పన్నులు చెల్లిస్తేనే స్థానిక సంస్థల మనుగడ
స్పష్టం చేసిన మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి – ఏపీ పట్టణ, పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పన్నులు విధిగా చెల్లించాలని లేక పోతే ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు. సోమవారం కార్పొరేషన్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పన్నులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్థానిక సంస్థలు మనుగడ సాధించాలంటే కార్పొరేషన్ లో, మునిసిపాలిటీలో ప్రజలు తప్పనిసరిగా టాక్స్ కట్టాలని స్పష్టం చేశారు పొంగూరు నారాయణ. ప్రాపర్టీ టాక్స్ ఏడాదికి 71 కోట్లు వస్తుందని, కానీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేస్తే అది కాస్తా పెరుగుతుందని, రూ. 100 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు మంత్రి.
ఇప్పటికే 93 కోట్ల రూపాయల పాత బకాయిలు ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయాల్సి ఉందన్నారు. ఇలాగైతే కష్టం అన్నారు పొంగూరు నారాయణ. టౌన్ ప్లానింగ్ నిబంధనల మేరకే ఇళ్ల నిర్మాణాలు చేసుకోవాలని అన్నారు. అవసరమైన అన్ని అనుమతులు నిర్ణీత సమయంలోనే వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.