గజ వాహనంపై లోకాభిరాముడు
తరించిన భక్త జన బాంధవులు
తిరుపతి – తిరుపతిలోని శ్రీ కోదండ రామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు రాత్రి 7 గంటలకు స్వామి వారు గజ వాహనంపై భక్తులను అనుగ్రహించారు.
గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు.
హైందవ సనాతన ధర్మంలో గజ వాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. రాజసానికి ప్రతీక మద గజం. రణ రంగంలో గానీ, రాజ దర్బారుల్లో గానీ, ఉత్సవాల్లో గానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహన సేవలో గజేంద్రుడు శ్రీవారిని వహించునట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామి కృపకు పాత్రులుకాగలరు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవోలు గోవింద రాజన్, నాగరత్న, ఏఈవో పార్థసారధి, సూపరింటెండెంట్ సోమశేఖర్, కంకణభట్టర్ సీతారామాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.