తెలంగాణ సర్కార్ పై వెంకయ్య ప్రశంస
తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం భేష్
అమరావతి – భారత దేశ మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తాను గత కొన్నేళ్లుగా తెలుగు భాష లోనే ఉత్తర్వులను జారీ చేయాలని కోరుతూ వస్తున్నానని తెలిపారు.
ఈ సందర్బంగా తాజాగా తెలంగాణ సర్కార్ రైతుల రుణ మాఫీకి సంబంధించి ఉత్తర్వులను తెలుగులోనే జారీ చేయడం పట్ల అభినందనలు తెలిపారు. ఇలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ముప్పవరపు వెంకయ్య నాయుడు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని తాను ఎప్పటి నుంచో సూచిస్తూనే ఉన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి అందులోనూ రైతుల రుణ మాఫీ మార్గ దర్శకాలపై తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని ప్రశంసించారు.
ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి సులువుగా అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు, పరిపాలనకు సంబంధించి ఇతర సమాచారం ఉండాలని కోరారు . ప్రజల సౌలభ్యానికి ప్రాధాన్యమిస్తూ తెలుగులో ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుకు, ఈ ఉత్తర్వుల రూపకల్పనలో పాలుపంచుకున్న ఇతర అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇక నుంచి అన్ని ఉత్తర్వులను, సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే అందించాలని సూచించారు ముప్పవరపు వెంకయ్య నాయుడు.