DEVOTIONALCULTURE

భార‌తీయ సంస్కృతి గొప్ప‌ది – వెంక‌య్య నాయుడు

Share it with your family & friends

మ‌న మూలాలు మ‌రిచి పోకూడ‌ద‌ని పిలుపు

హైద‌రాబాద్ – భార‌తీయ సంస్కృతి గొప్ప‌ద‌ని, అత్యంత ప్ర‌త్యేక‌మైన‌ద‌ని పేర్కొన్నారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు. హైద‌రాబాద్ లో లోక్ మంథన్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను ఆయ‌న ప్రారంభించి ప్ర‌సంగించారు.

చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. నేటికీ ప్రకృతితో కలిసి జీవిస్తూ, సామాజిక ప్రధాన జీవన స్రవంతిలో మరుగు పడిన వర్గాలను, మనం నాగరికం అనుకుంటున్న సమాజానికి తిరిగి చేరువ చేసి, నేటి యువతకు నిజమైన ధర్మాన్ని తెలియజేయటమే లక్ష్యంగా సాగుతున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు .

రాయి, రప్ప, చెట్టు, పుట్ట, గాలి, నీరు… ఇలా అన్నింటిలోనూ భగవంతుణ్ని చూడగలిగి, సమస్త మానవాళి అభివృద్ధిని ఆకాంక్షించిన వసుధైవ కుటుంబ భావన భారతీయుల సొంతం అన్నారు ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు.

మన సంస్కృతి మీద జరిగిన దాడులు, మనదైన సంస్కృతిని దూరం చేసి, అనేక ప్రతికూల భావనలను మన మనసుల్లో నాటాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ జాఢ్యాలను వదిలించుకుని, మూలాలను తిరిగి తెలుసుకుని, భారతీయ విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని భవిష్యత్ తరాలకు మన ధర్మాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలను, భాషను మరింత చేరువ చేయాలని పిలుపునిచ్చారు.