ముప్పవరపు వెంకయ్య నాయుడు
హైదరాబాద్ – తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, నటిగా విశిష్ట సేవలు అందించిన కృష్ణవేణి జీవితం చిరస్మరణీయమని అన్నారు మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు. హైదరాబాద్ లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో కృష్ణవేణి సంస్మరణ సభ నిర్వహించారు. ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. 101 ఏళ్లు బతికారని, ఎందరికో జీవితాలను ఇచ్చారని ప్రశంసించారు. కృష్ణవేణి లేని లోటు పూడ్చ లేనిదన్నారు .
ఆదర్శప్రాయమైన జీవితం గడిపిన, ఎందరో ప్రముఖ నటీనటులు ఇతర సాంకేతిక సిబ్బందిని చలనచిత్ర రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణి సంస్మరణ సభను ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ వారు నిర్వహించటం అభినందనీయమన్నారు ముప్పవరపు వెంకయ్య నాయుడు.
సినిమాను బాధ్యతాయుతమైన వ్యాపారంగా నాటి సినీ రంగ ప్రముఖులు అభివృద్ధి చేశారన్నారు. అలాంటి వారిలో కృష్ణవేణి వంటి వారు మొదటి వరుసలో నిలుస్తారని కొనియాడారు. కృష్ణవేణి గారిని ఈ తరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
సినిమా అంటే వ్యాపారం మాత్రమే కాదు, ప్రజలను ప్రభావితం చేసే ఉన్నతమైన మాధ్యమం అనే స్పృహను పెంపొందించు కోవలసిన అవసరం ఉందన్నారు. సినిమా రంగంలో ఉన్నత ప్రమాణాలు, ఉత్తమ సంప్రదాయాలు, మంచి భాష, హుందాతనానికి పెద్దపీట వేయాలన్నారు వెంకయ్య నాయుడు.