పిన్నెల్లి ప్రతాపం ఈవీఎం ధ్వంసం
ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డిపై సీరియస్
అమరావతి – అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా వ్యవహరించడం అలవాటుగా మారింది ప్రజా ప్రతినిధులకు. ఓ వైపు సీసీ కెమెరాలు, పోలింగ్ సిబ్బంది, పోలీసులు ఉన్నప్పటికీ ఏపీ అధికర వైసీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అందరూ చూస్తూ ఉండగానే దౌర్జన్యంగా పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న ఈవీఎంను నేల కేసి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
దీనిపై సీరియస్ గా తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. వెంటనే సదరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని. పోలీసుల నివేదిక ప్రకారం విచారణలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని నిందితుడిగా చేర్చారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు.
మాచర్ల శాసనసభ నియోజకవర్గంలో ఈవీఎంను ధ్వంసం చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణకు ఆదేశించారు సీఈవో. ఏడు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఇదిలా ఉండగా పిన్నెల్లి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.