50 మందికి పైగా గాయాలు
ఉత్తర ప్రదేశ్ – యూపీ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాలో తొక్కిసలాట చోటు చేసుకుంది. మౌని అమవాస్య సందర్బంగా పుణ్య స్నానాలు చేసేందుకు భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. భక్తుల తాకిడికి ఏర్పాటు చేసిన బారికేడ్లు విరిగి పడడంతో ఒకరిపై మరొకరు పడ్డారు. ఈ ఘటనలో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన సిబ్బంది బాధితులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. స్పందించిన సీఎం సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
ప్రాథమిక సమాచారం మేరకు పలువురు మహిళలు ఊపిరి ఆడక మరణించినట్లు సమాచారం. దీంతో అఖారాలు హోలీ డిప్ ను రద్దు చేసుకున్నారు. కుంభ మేళా ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఆస్పత్రిలో 30 మందికి పైగా మహిళలు చేరారు. మౌని అమవాస్య కావడంతో పుణ్య స్నానాలు చేస్తే పుణ్యం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
జనవరి 13న అంగరంగ వైభవంగా ప్రారంభమైంది మహా కుంభ మేళా. యూపీ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. వచ్చే నెల ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ అంచనా ప్రకారం 11 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు చేసినట్లు సమాచారం.