సీఎం ఆదిత్యా నాథ్ తో ఫోన్ లో ఆరా
ఢిల్లీ – ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహా కుంభ మేళాలో భారీ ఎత్తున తొక్కిసలాట చోటు చేసుకుంది. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మౌని అమవాస్య కావడంతో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో ఏర్పాటు చేసిన బారికేడ్లు విరిగి పోవడంతో ఒకరిపై మరొకరు పడ్డారు. మహిళలు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదిత్యా నాథ్ ను ఆదేశించారు. ఆస్పత్రులకు తరలించామని చికిత్స కొనసాగుతోందని తెలిపారు సీఎం.
మహాకుంభ్ కోసం 12 కిలోమీటర్ల పొడవైన నదీ తీరాల వెంబడి సంగం, ఇతర ఘాట్‌ల వద్ద జనసమూహం బుధవారం తెల్లవారు జామున గుమిగూడిన సమయంలో ఈ సంఘటన జరిగింది. ప్రధాన మంత్రి మోడీ కొనసాగుతున్న పరిణామాలను సమీక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడారు. కేంద్రం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ఘటన చోటు చేసుకున్న వెంటనే సిబ్బంది అంబులెన్స్‌లను త్వరగా స్థలానికి తరలించారు. గాయపడిన వ్యక్తులను కుంభ్‌లోని సెక్టార్ 2లోని తాత్కాలిక ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలోని కొంతమంది వృద్ధులు, మహిళలు ఊపిరాడక స్పృహ కోల్పోయారు, ఫలితంగా వారు కుప్పకూలి పోయారు. దీంతో తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడింది. మహిళలు, పురుషులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో, జనసమూహం బారికేడ్లు విరిగి పోయాయి. దీని ఫలితంగా దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు.