ఘనంగా మహా శివ రాత్రి
నంద్యాల జిల్లా – మహా శివ రాత్రి పర్వదినం సందర్బంగా శ్రీశైల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. ఇసుక వేస్తే రాలనంత భక్తజనం తండోప తండాలుగా తరలి వచ్చారు. ఎటు చూసినా శివ నామ స్మరణతో మారుమ్రోగుతోంది. ప్రభుత్వ యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామి, అమ్మ వార్లకు విశేష పూజలు చేపట్టారు. లోక కళ్యాణం కోసం రుద్ర హోమం, చండీ హోమం, జపాలు, పారాయణాలు చేపడుతున్నారు.
ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికబద్దంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూ కాంప్లెక్స్ లో అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు ఇస్తున్నారు. భక్తులకు ఉచిత లడ్డు ప్రసాద వితరణ చేపట్టారు. ఈ సాయంకాలం శ్రీశైలం క్షేత్రంలో ప్రభోత్సవం జరగనుంది. దీంతో పాటు నంది వాహన సేవ, ఆలయ ఉత్సవం నిర్వహించనున్నారు.
ఇవాళ రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేపడతారు. అనంతరం పాగాలంకరణ ఉంటుంది. రాత్రి 12.00 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు దివ్య కల్యాణ మహోత్సవం జరుగుతుంది. ఉత్సవంలో పలు సంప్రదాయ జానపద కళారూపాల ప్రదర్శన చేపట్టారు.
ఆలయ దక్షిణ మాడ వీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ధ, పుష్కరిణి వేదిక వద్ద, శివదీక్షా శిబిరాల వేదిక వద్ద , గో సంరక్షణశాల దగ్గరలోని యాంఫీ థియేటర్ నందు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.