ప్రకటించిన మహంత్ రవీంద్ర పురి
ఉత్తర ప్రదేశ్ – ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహా కుంభ మేళాలో మౌని అమవాస్య సందర్బంగా పెద్ద ఎత్తున తొక్కిసలాట చోటు చేసుకుంది. భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఏర్పాటు చేసిన బారికేడ్లు విరిగి పడడంతో ఒక్కసారిగా ఒకరిపై మరొకరు పడ్డారు. చాలా మంది ఊపిరి ఆడక స్పృహ తప్పి పడి పోయారు. దీనిపై స్పందించారు అఖిల్ భారతీయ అఖార పరిషత్ చీఫ్ మహంత్ రవీంద్ర పురి. ఘటన జరగడం బాధాకరమని, అమృత స్నానం రద్దు చేసుకున్నామని ప్రకటించారు.
బుధవారం తెల్ల వారు జామున చోటు చేసుకున్న ఈ ఘటనపై మీడియాతో మాట్లాడారు పురి. సాధువులంతా అమృత స్నానం చేసేందుకు సిద్దంగా ఉన్నారని, ఈ సమయంలో స్నానం చేయడం పద్దతి కాదని తాము సాధువులు, భక్తులకు సూచించడం జరిగిందన్నారు. మౌని అమవాస్య కావడంతో ఊహించని రీతిలో పుణ్య స్నానాలు చేసేందుక వచ్చారని అన్నారు. తీవ్రంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా అఖాడ పరిషత్ ప్రధాన కార్యదర్శి, జునా అఖార పోషకుడు మహంత్ హరి గిరి కూడా భక్తులు ఎక్కడ ఉన్నా గంగా నదిలో స్నానం చేసి ఇళ్లకు తిరిగి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడి తక్షణ సహాయ చర్యలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.