దార్శకుడిని కోల్పోయిన దేశం – మహేష్ భగవత్
రతన్ టాటా మరణం జాతికి తీరని నష్టం
హైదరాబాద్ – తెలంగాణ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి చెందడం పట్ల భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి వ్యక్తులు తరుచుగా పుడుతుంటారని అన్నారు. గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు మహేష్ భగవత్.
ఈ సందర్బంగా తనకు టాటా మోటార్స్ కు మధ్య ఉన్న సంబంధం గురించి గుర్తు చేసుకున్నారు. దివంగత రతన్ టాటాతో కలిసిన ఫోటోను పంచుకున్నారు. ఇవాళ అత్యంత బాధాకరమైన రోజుగా ఆయన పేర్కొన్నారు.
ప్రజల పట్ల అచంచలమైన ప్రేమ, సమాజం పట్ల బాధ్యత , దాతృత్వం, దయ, కరుణ గుణం కలిగిన మహోన్నత మానవుడు రతన్ టాటా అని కొనియాడారు . తాను టాటా మోటార్స్ పూణేలో 1993 నుండి 1994 వరకు పని చేశానని తెలిపారు.
2018లో నా రాచకొండ కమిషనరేట్‌లో భాగమైన ఆదిబట్లలో హైదరాబాద్‌లోని టాటా ఏరోస్పేస్ , బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, సికోర్స్కీ సహకార ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా రతన్ టాటాను వ్యక్తిగతంగా కలుసుకుని పలకరించే అవకాశం వచ్చిందన్నారు.
ఆ సమావేశంలో ‘హమ్నే భీ టాటా కా నమక్ ఖయా హై’ ఒక ప్రసిద్ధ ప్రకటన కోట్ షేర్ చేశారని తెలిపారు.
అందరూ నవ్వుతుండగా రతన్ టాటా తనను భుజం తట్టి , తన సెక్యూరిటీని మహేష్ భగవత్ చూసుకుంటాడని చెప్పారని, ఆ క్షణాలను మరిచి పోలేనని పేర్కొన్నారు. రతన్ టాటా లాంటి వ్యక్తి పుట్టరని , ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు .