కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయం – టీపీసీసీ చీఫ్
మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్
వరంగల్ జిల్లా – తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి అరెస్ట్ కావడం పక్కా అని స్పష్టం చేశారు. శనివారం హన్మకొండలో మీడియాతో మాట్లాడారు టీపీసీసీ చీఫ్.
కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు ముందస్తుగా రాష్ట్ర గవర్నర్ బిష్ణు దేవ్ వర్మను అడిగామని ఇంకా అక్కడి నుంచి పర్మిషన్ రాలేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. విచిత్రం ఏమిటంటే కేటీఆర్ పదే పదే తాను జైలుకు పోతానంటూ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదంతా తనంతకు తానుగా ప్రచారం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నం తప్ప మరోటి కాదన్నారు టీపీసీసీ చీఫ్.
తను తప్పు చేశాడని , తన కుటుంబం అవినీతికి పాల్పడిందని తెలుసు కాబట్టే తను అరెస్ట్ అవుతానంటున్నాడని అన్నారు. అంతే కాదు కేటీఆర్ ఒక్కడే కాదు ఆయన కుటుంబం కూడా జైలుకు వెళ్లక తప్పదన్నారు. గత 10 ఏళ్లలో జరిగిన అవినీతి మీద, అక్రమాల మీద తప్పకుండా విచారణ జరుగుతుందని ప్రకటించారు మహేష్ కుమార్ గౌడ్.
వాస్తవాలు బయటకు వచ్చాక, విచారణ అనంతరం ఎవరికి ఏ శిక్ష వేయాలో కోర్టు నిర్ణయిస్తుందన్నారు.