అమ్మ వారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
టీటీడీ ఈవో జె.శ్యామల రావు
తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామల రావు అధికారులను ఆదేశించారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల సమావేశం మందిరంలో సోమవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ నవంబరు 28 నుండి డిసెంబరు 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
చలువ పందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పిఏ సిస్టమ్, ఎల్‌ఇడి తెరలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. వాహనసేవల్లో పాల్గొనే ఇతర రాష్ట్రాల కళాబృందాల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు ఈవో.
శుక్రవారపు తోటలో పుష్ప ప్రదర్శనశాలతోపాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు. బ్రహ్మోత్సవాల రోజులతోపాటు పంచమి తీర్థం నాడు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలన్నారు. వాహన సేవల్లో ఏనుగులు, అశ్వాలు, వృషభాల వద్ద శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలన్నారు.
భక్తులకు సరిపడా తాత్కాలిక, మొబైల్ మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలని, మెరుగ్గా పారిశుద్ధ్యం ఉండాలని ఈవో ఆదేశించారు. భక్తులకు వైద్య సేవలందించేందుకు వైద్యులు, పారామెడికల్ సిబ్బందితోపాటు అంబులెన్సులు, మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
టిటిడి నిఘా, భద్రతా అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పంచమి తీర్థం రోజున భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని, ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, సిసిటివిల ద్వారా భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఇతర తదితరులు పాల్గొన్నారు.