తిరుమల పోటెత్తిన భక్త బాంధవులు
తిరుమల : తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడ వీధులలో విహరిస్తూ భక్తులను మురిపించారు.
శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు ,వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహా శాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి వారికి, దేవేరులకు అభిదేయక అభిషేకాన్ని కన్నుల పండుగగా చేపట్టారు.
సాయంత్రం శ్రీ మలయప్పస్వామి వారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్ర దీపాలంకార సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించారు. కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామి వారి ముగ్ద మనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.