మోడీపై భగ్గుమన్న ఖర్గే
గాంధీపై కామెంట్స్ సీరియస్
న్యూఢిల్లీ – ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఏకి పారేశారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన జాతిపిత మహాత్మా గాంధీ గురించి చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఖర్గే.
విచిత్రం ఏమిటంటే గాంధీ సినిమా చూసిన తర్వాతనే మహాత్మా గాంధీ గురించి తెలుసుకున్నానని నరేంద్ర మోడీ చెప్పడం దారుణమన్నారు. ఒక జాతి విముక్తి కోసం పాటు పడిన వ్యక్తి గురించి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది అంటూ ప్రశ్నించారు.
మోడీని చూస్తే తనకు నవ్వు వస్తోందన్నారు మల్లికార్జున్ ఖర్గే. యావత్ ప్రపంచానికి మహాత్ముడి గురించి తెలుసన్నారు. వివిధ దేశాలలో గాంధీ విగ్రహాలు కూడా ఉన్నాయని, చాలా దేశాలలో పోరాటాలు, ఉద్యమాలు, ఆందోళనలకు స్పూర్తిగా నిలిచారని కొనియాడారు.
నరేంద్ర మోడీకి గాంధీ గురించి తెలియక పోతే భారత రాజ్యాంగం గురించి కూడా తెలియదని అనుకోవాల్సి ఉంటుందన్నారు ఏఐసీసీ చీఫ్.