రాజ్యాంగం మోదీ సొత్తు కాదు
నిప్పులు చెరిగిన మల్లికార్జున్ ఖర్గే
కేరళ – ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నిప్పులు చెరిగారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం కులం, మతం ప్రాతిపదికగా మనుషులను చీల్చి, విభేదాలు సృష్టించి ఓట్లను దండు కోవాలనే నీచమైన రాజకీయాలకు తెర తీయడం బాధాకరమన్నారు.
విచిత్రం ఏమిటంటే తాము ఎన్నడూ హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచుతామని ఎక్కడా చెప్ప లేదన్నారు. అబద్దాలను నమ్ముకుని పాలన సాగిస్తున్న మోదీకి ఇతరుల మీద ఆరోపణలు, విమర్శలు చేయడం అలవాటుగా మారిందని మండిపడ్డారు ఖర్గే.
ఈసారి గనుక పవర్ లోకి వస్తే రాజ్యాంగంలో మార్పులు తీసుకు వస్తామని పదే పదే చెబుతున్న మోదీపై కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈసీనా లేక మోదీ జేబు సంస్థ అని భావిస్తున్నారా అని నిప్పులు చెరిగారు.
రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకికవాదం, ప్రాథమిక హక్కులు , ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్న ఏకైక జాతీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. ఇకనైనా మోదీ తన నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు. కేరళలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఖర్గే ప్రసంగించారు.