40,33,702 మందికి ఉచితంగా విద్యుత్
ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్ – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. తాము ప్రకటించిన 6 గ్యారెంటీల అమలులో భాగంగా గృహ జ్యోతి పథకం సక్సెస్ అయ్యిందని తెలిపారు. ఇది పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతుందని స్పష్టం చేశారు. సచివాలయంలో మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.
కాగా గృహజ్యోతి పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 40,33,702 మందికి ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నామని చెప్పారు. అయితే కొందరు కావాలని తమ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకని నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మల్లు భట్టి విక్రమార్క.
తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు డిప్యూటీ సీఎం. ప్రజాపాలన లో రేషన్ కార్డు నెంబర్, విద్యుత్తు సర్వీసు నెంబర్ ను సరిగ్గా పొందు పరిచి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈ నెల జిరో బిల్లు వచ్చిందని వెల్లడించారు.
దరఖాస్తులో పొరపాటున తప్పులు ఉంటే, వారు వెంటనే ఎంపిడివో కార్యాలయం వెళ్లి అక్కడ ఉన్న ప్రజపాలన అధికారికి తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో అప్‌డేట్ అయిన తరువాత జీరో బిల్లు వస్తుందన్నారు.