విద్యుత్ కోతలు లేకుండా చూడాలి
ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్ – ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోందని, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.
విద్యుత్ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, ఎస్పీడీసీఎల్ సీఎండి ముషారఫ్ అలీ ఫరూఖీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి హాజరయ్యారు. రానున్న వేసవికాల దృష్ట్యా నాణ్యమైన విద్యుత్ సరఫరా గురించి జిల్లాల ఎస్.ఈ లతో రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.
ఇప్పటికే పలు చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయని, ఓ వైపు పంటలు వేసుకున్న రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు డిప్యూటీ సీఎం. సబ్ స్టేషన్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు అంతరాయం ఏర్పడకుండా చూడాలని సూచించారు భట్టి విక్రమార్క.
తాము ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ ఉచిత విద్యుత్ అందజేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. త్వరలోనే ఇది అమలు అవుతుందన్నారు డిప్యూటీ సీఎం.