పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ ఫిర్యాదు
దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్ – మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై మరొకరు ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. ఈ తరుణంలో నిన్న ఆస్పత్రి పాలై ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇంటికి వెళ్లి పోయిన మంచు మనోజ్ ఉన్నట్టుండి సోమవారం రాత్రి ప్రత్యక్షం అయ్యారు.
ఆయన హైదరాబాద్ లోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ మేరకు ఫిర్యాదు చేశారు. తనపై దాడికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మంచు మోహన్ బాబు పీఆర్ టీం మాత్రం నిన్న ఎలాంటి దాడి జరగలేదని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది.
కానీ ఉన్నట్టుండి ఇవాళ మంచు మనోజ్ స్వయంగా ఠాణాకు రావడంతో అసలు వాస్తవం బయట పడింది. కుటుంబంలో పెద్ద ఎత్తున విభేదాలు చోటు చేసుకోవడంతో సినిమా రంగానికి చెందిన వారు విస్మయానికి లోనయ్యారు.
మరో వైపు నిన్న తన భార్య మౌనికా రెడ్డితో కలిసి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ పరీక్షలు చేయించుకున్నారు. ఆస్పత్రి ఇచ్చిన రిపోర్టుల ఆధారాలను పోలీస్ స్టేషన్ లో సమర్పించినట్లు సమాచారం.