ఉత్తమ్ కుమార్ రెడ్డితో మందకృష్ణ భేటీ
హైదరాబాద్ – ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణలో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్ది నిమ్న కులాలకు న్యాయం చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని, కానీ చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని పరిగణలోకి తీసుకోలేదన్నారు. వెనుకబడిన కులాలను ఏ గ్రూప్ లో కలపాలనే దానిపై సీఎం రేవంత్ రెడ్డికి తెలియ చేశామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను ఏ, బీ, సీ కేటగిరీలుగా వర్గీకరణ చేసిందన్నారు మందకృష్ణ మాదిగ. దీని కారణంగా కొన్ని కులాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణలో ప్రభుత్వం ఆమోదించిన నివేదికలో లోపాలను సవరించాలని, అన్ని కులాలకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు.
ఇదిలా ఉండగా ఎస్సీ వర్గీకరణ సబబేనంటూ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీనిని స్వాగతించారు. మందకృష్ణ మాదిగ తన సామాజిక వర్గం కోసం , అణగారిన వర్గాల సంరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉమ్మడి ఏపీలో పోరాటాలు చేశారు. ఆయన చేసిన ఉద్యమాల వల్లనే ఆరోగ్య శ్రీ పథకం వచ్చింది.