మందకృష్ణా నిను మరువదు ఈ గడ్డ
30 ఏళ్ల పోరాటం ఫలించిన వేళ
ఎస్సీ వర్గీకరణ విషయంలో దేశ సర్వోన్నత న్యాయ స్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఇది ఒక రకంగా అణగారిన వర్గాలకు బలాన్ని, శక్తిని కలిగించేందుకు తోడ్పాటు కలిగించనుందని చెప్పక తప్పదు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినా ఇంకా చాలా కులాలు, వర్గాలు సామాజిక ఫలాలను అందుకోలేక పోతున్నాయి. దీనికి ఎన్నో అవాంతరాలు, మరెన్నో అడ్డంకులు. కుల వ్యవస్థ ఆక్టోపస్ లాగా అల్లుకు పోయింది దేశాన్ని. దీనిని సమూలంగా మార్చేయాలని కలలు కన్నవాళ్లు ఆచరణలోకి రావాలని ఆశించిన వాళ్లు నామ రూపాలు లేకుండా పోయారు. ఎందుకంటే ప్రశ్నించే వాళ్లను ఈ సమాజం ఎప్పటికీ భరించదు. ప్రభుత్వానికి వ్యతిరేకులుగానే చూస్తుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం.
ఇవాళ ఒకే ఒక్కడి పేరు మాత్రం వినిపిస్తోంది. ఇది ఎవరో కావాలని చేస్తే రాలేదు. చర్చనీయాంశంగా మారలేదు. తన జాతి తర తరాల నుంచి అవమానాలకు, వివక్షకు లోనవుతోందని ఆవేదన చెందాడు తెలంగాణ ప్రాంతానికి చెందిన మట్టి బిడ్డ మందకృష్ణ మాదిగ. ఒకప్పుడు మాదిగలంటే దూరంగా పెట్టే వారు. అలాంటి వాళ్లకు సామాజికంగా గౌరవాన్ని తీసుకు వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి తనే మాదిగలకు ఒక పర్యాయ పదంగా మారి పోయాడు తను. ఈ పరిణామ పోరాట క్రమంలో లెక్కకు మించిన ఆరోపణలు, విమర్శలు అంతకు మించిన కేసులు ఉన్నాయి. వాటిన్నింటిని దాటుకుని తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇవాళ మనముందు విజేతగా నిలిచాడు. అన్ని పార్టీలను, సామాజిక వర్గాలను, ప్రజా సంఘాలను కలుపుకుని ముందుకు సాగాడు.
ఓ వైపు మాలలు మరో వైపు మాదిగలు అన్న భేదాభిప్రాయాలతో సాగుతున్న క్రమంలో అందరినీ ఒకే చోటుకు చేర్చే ప్రయత్నం చేశాడు. తను చని పోయే లోపు తన జాతికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కోరుకున్నాడు. అది ఇవాళ సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం రూపంలో కీలకమైన తీర్పు ద్వారా లభించింది. దీనికి కొంత మేర తోడ్పాటు చంద్రబాబు కల్పించినా మొత్తంగా మంధ కృష్ణ మాదిగను అభినందించకుండా ఉండలేం. ఎందుకంటే మాదిగలు, వికలాంగులు అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది ఎవరైనా మందకృష్ణనే. ఆయన వయసు ఇప్పుడు 59 ఏళ్లు. మాదిగ దండోరాకు శ్రీకారం చుట్టి వందలాది కిలోమీటర్లు నడిచి..ప్రజలతో మమేకమై ఉద్యమాలకు, పోరాటాలకు ప్రాణం పోసిన వాడు మందకృష్ణ.
ఆయన పూర్తి పేరు ఎల్లయ్య. కుల వ్యతిరేక కార్యాచరణ తో ప్రారంభమైన ఆయన ప్రస్థానం నేటి రిజర్వేషన్ల వర్గీకరణ దాకా అప్రహతితంగా కొనసాగుతూ వచ్చింది. ఆధిపత్య కులాలను, వారి భావజాలానికి వ్యతిరేకంగా ప్రశ్నించాడు. నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు..అట్టడుగు దళితల వర్గాల హక్కుల కోసం తీవ్రవాదాన్ని విడిచి పెట్టాడు. ఎన్నో ఉద్యమాలలో భాగస్వామిగా ఉన్నాడు. 1994లో ప్రకాశం జిల్లాలో ఎస్సీలలో ఉప వర్గాలు సృష్టించాలని ఉద్యమం జరిగింది. ఈ పోరాటానికి నాయకత్వం వహించాడు మందకృష్ణ. ఆ తర్వాత ఎంఆర్పీఎస్ గా మారింది. 2008లో నిరాహార దీక్షకు దిగాడు. ప్రతి ఒక్కరు మాదిగ అనేది పేరు పెట్టుకోవాలని కోరాడు. ఇవాళ అది తమ ఆత్మ గౌరవ పతాకంగా ఎలుగెత్తి చాటేలా చేశాడు మందకృష్ణ మాదిగ.
అంతేనా 2004లో గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న చిన్నారుల పాలిట దైవంగా మారాడు. వారి తరపున పోరాడాడు. ఆయన ఉద్యమం ఫలించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వేలాది మంది దీని బారిన పడినట్లు గుర్తించారు. మందకృష్ణ చేసిన ఈ ప్రయత్నమే ఆనాటి దివంగత రాజశేఖర్ రెడ్డి తీసుకు వచ్చిన ఆరోగ్య శ్రీకి ప్రేరణగా నిలిచింది. వికలాంగుల కోసం 2007లో వికలాంగుల హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలపైన నిరంతరం ఉద్యమిస్తూ వచ్చాడు మందకృష్ణ మాదిగ. 30 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో తను అనుకున్న కలను సాధించాడు. అణగారిన వర్గాలన్నీ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చాడు.