ప్రజా పాలన కాదు రెడ్ల పాలన
నిప్పులు చెరిగిన మందకృష్ణ మాదిగ
హైదరాబాద్ – ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ మాదిగలను విస్మరించిందని మండిపడ్డారు. మాల సామాజిక వర్గానికి , ప్రత్యేకించి రెడ్లకు అత్యధికంగా ప్రయారిటీ ఇస్తున్నారని ఆరోపించారు.
విచిత్రం ఏమిటంటే రేవంత్ రెడ్డి తన సామాజిక వర్గం మరింత బలోపేతం అయ్యేలా కృషి చేస్తున్నాడే తప్పా ప్రజల కోసం పని చేయడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజా పాలన సాగడం లేదని , కేవలం రెడ్ల పాలన మాత్రమే కొనసాగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.
ఇవాళ ప్రధాన పోస్టులలో మొత్తం రెడ్లనే నింపారని, ఇక తీవ్రమైన ఆరోపణలు ఉన్న మాజీ డీజీపీకి ఎలా టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిని కట్ట బెడతారంటూ ప్రశ్నించారు మందకృష్ణ మాదిగ. మాదిగల ఓట్లు పొంది గెలుపొందిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తమ సామాజిక వర్గాన్ని పట్టించు కోవడం లేదని ధ్వజమెత్తారు. నామినేటెడ్ పదవుల్లో 12 రెడ్లకు ఇస్తే ఒక్కటి మాత్రమే తమకు ఇచ్చారని అన్నారు.