మాదిగలకు మంగళం మాలలకు అందలం
సీఎం రేవంత్ రెడ్డిపై మందకృష్ణ మాదిగ ఫైర్
హైదరాబాద్ – మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పనిగట్టుకుని మాదిగలను అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.
మంగళవారం హైదరాబాద్ లో మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. సీఎం కావాలని కక్ష కట్టడం దారుణమన్నారు. మాలలతో కుమ్మక్కై తెర వెనుక మంత్రాంగం నడిపాడని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లోనూ, సార్వత్రిక ఎన్నికల్లోనూ మాలలకు ప్రయారిటీ ఇచ్చాడని పేర్కొన్నారు. ఇదే సమయంలో మాదిగ జాతిలో ఎందరో నాయకులు ఉన్నప్పటికీ కావాలని వారిని పక్కన పెట్టాడని ధ్వజమెత్తారు మందకృష్ణ మాదిగ.
మాదిగలను రాజకీయ పరంగా భాగస్వామ్యం కాకుండా ఉండేందుకు శత విధాలుగా ప్రయత్నం చేశాడని రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. మాదిగల సీట్లు తగ్గడానికి మాలల సీట్లు పెరగడానికి ఆయనే కారణమని ఆరోపించారు మందకృష్ణ మాదిగ.
ఈ సందర్భంగా సత్తుపల్లి, వర్థన్నపేట, చొప్పదండి, చెన్నూరు స్థానాలకు గాను మూడు స్థానాలలో మాదిగలు ఎమ్మెల్యేలుగా ఉన్నారని చెప్పారు. అయితే మాదిగలకు టికెట్లు ఇవ్వకుండా అడ్డుకున్నాడని రేవంత్ రెడ్డిపై భగ్గుమన్నారు. చెన్నూరులో ఓదేలుకు ద్రోహం చేసి వివేక్ కు టికెట్ ఇచ్చాడని ఆరోపించారు.