సీఎం రేవంత్ రెడ్డికి మందకృష్ణ లేఖ
హైదరాబాద్ – ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డికి సుదీర్ఘ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తిగా జరిగే వరకు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను నిలిపి వేయాలని కోరారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అందులో చట్టం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మళ్లీ గ్రూప్ 1 ,గ్రూప్ 2 , గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటన చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. రిజల్ట్స్ ప్రకటిస్తే తమ జాతికి చెందిన అభ్యర్థులు తీవ్రంగా నష్ట పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక వేళ గనుక ప్రభుత్వం , టీజీపీఎస్సీ ఫలితాలు ప్రకటిస్తే అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని ప్రకటించారు. అందుకే ముందు జాగ్రత్తగా అన్ని పరీక్షల ఫలితాలను వెంటనే నిలిపి వేయాలని, ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశంను ఆదేశించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే సంస్థ పరంగా నిర్వహించే పరీక్షలకు సంబంధించి తమకు నమ్మకం లేకుండా పోయిందన్నారు మందకృష్ణ మాదిగ. ఒకవేళ అదే జరిగితే మేము మరింత నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇంతకు ముందు 11 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేయడం వల్ల చాలా పోస్టులు నష్ట పోవడం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యేంత వరకు నిలిపి వేయాలని కోరారు.