పవన్ కామెంట్స్ మందకృష్ణ సీరియస్
అనితపై అనుచిత వ్యాఖ్యలు తగదు
అమరావతి – జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెలపై నిప్పులు చెరిగారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) జాతీయ అధ్యక్షుడు , ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగ. ఆయన మర్యాద పూర్వకంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాటానికి ముందు నుంచి మద్దతు పలికారని, ఈ సందర్బంగా అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు మందకృష్ణ మాదిగ.
తమ దళిత సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పై చులకన చేస్తూ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏం అర్హత ఉందని అలా బహిరంగంగా మాట్లాడావంటూ నిప్పులు చెరిగారు మందకృష్ణ మాదిగ. ఒక పార్టీకి అధినేతగా, ముఖ్యమైన పదవిలో ఉన్న నీవు ఒక మహిళ పట్ల ఇలాగేనా మాట్లాడేది అంటూ మండిపడ్డారు.
ఇంకోసారి నోరు గనుక జారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పదే పదే సామాజిక న్యాయం పాటిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈసారి జరిగిన ఎన్నికల్లో ఎంత మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారో చెప్పాలన్నారు.
దళిత సామాజిక వర్గంలో ఎస్సీలకే మూడు సీట్లు ఇచ్చాడని, మాదిగ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా, కడప జిల్లాలోని రైల్వే కోడూరులో టికెట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు మందకృష్ణ మాదిగ. ఏదైనా సమస్య ఉంటే కేబినెట్ లో చర్చించాలని లేక పోతే సీఎంతో మాట్లాడాలని కానీ ఇలా బహిరంగంగా హోం మంత్రి, దళిత మహిళను పట్టుకుని మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.