టికెట్ కంటే ఆత్మ గౌరవం ముఖ్యం
మాజీ ఉప సభాపతి బుద్ద ప్రసాద్
అమరావతి – రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో తనకు టికెట్ కంటే ఆత్మ గౌరవం ముఖ్యమని స్పష్టం చేశారు మాజీ ఉప సభాపతి బుద్ద ప్రసాద్. టికెట్ కోసం ఎవరినీ దేబరించాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాను ఎవరికీ తలవంచే వ్యక్తిని కానని పేర్కొన్నారు.
కండువాలు మార్చే బుద్ది తనకు లేదని కుండ బద్దలు కొట్టారు మండలి బుద్ద ప్రసాద్. సామాన్యులు చట్ట సభల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే తనకు అసహ్యం వేస్తోందన్నారు.
ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామంలో మండలి బుద్ద ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. తనకు టికెట్ ఇవ్వాలని ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వారు కోరుతున్నారని తెలిపారు. రాజకీయ పార్టీలు అందరిని సమన్వయం చేసుకోవాలని సూచించారు.
మిగతా వారి ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. తన ఆలోచనంతా ప్రజలే అని సంపాదన కాదన్నారు. నా వ్యక్తిగత అవసరాల కోసం ఎవరిని ఉపయోగించు కోలేదన్నారు. దివిసీమలో అనేక పోరాటాలు చేశామని, పార్టీ పిలుపు ఇవ్వక పోయినా ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేశామన్నారు మండలి బుద్ద ప్రసాద్.