కేంద్రం నియంతృత్వం పోరాడక పోతే ప్రమాదం
ఇండియా కూటమిని హెచ్చరించిన సిసోడియా
ఢిల్లీ – ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన 17మ నెలల సుదీర్ఘ జైలు జీవితం గడిపిన అనంతరం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. అనంతరం గాంధీ మహాత్ముడి సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా శనివారం మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో కొలువు తీరిన మోడీ భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ అత్యంత ప్రమాదకరమైన చట్టాలను తీసుకు వస్తోందని ఆరోపించారు. కేంద్రం నియంతృత్వాన్ని ఎదుర్కోక పోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు.
ప్రధానంగా ఇటీవల ఎన్డీయేలో చేరిన వారికి నేను చెప్పేది ఏమిటంటే ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మాత్రమే జైలుకు వెళ్తారని అనుకోకండి, త్వరలోనే మీ వంతు కూడా వస్తుందని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు మనీష్ సిసోడియా.
ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చి గళం విప్పితే 24 గంటల్లో అరవింద్ కేజ్రీవాల్ కూడా బయటకు వస్తారని అన్నారు. ‘క్విట్ డిక్టేటర్ షిప్ ఇండియా’ కోసం మనమంతా పోరాడాలని పిలుపునిచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ మాఫియాలు, ఉగ్రవాదులపై అమలు చేస్తున్న చట్టాలనే రాజకీయ నాయకులు, వ్యాపారులు, సామాన్యులపై కూడా అమలు చేసి బెయిల్ కూడా రాకుండా జైల్లోనే ఉంచుతున్నారని ఆరోపించారు.