ఢిల్లీ ఎల్జీపై సిసోడియా షాకింగ్ కామెంట్స్
కేంద్రం చెప్పినట్టు నడుచుకుంటే ఎలా..?
ఢిల్లీ – ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం తప్పితే ఆయన చేసింది ఏమీ లేదన్నారు.
గతంలో సుఖేష్ చంద్రశేఖర్ నిరాధారమైన ఆరోపణలు చేశారని, తమ నాయకుడు, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను బద్నాం చేసే కుట్రలో భాగంగా లేఖ రాస్తే దానిని ఆధారంగా చేసుకుని విచారణకు ఆదేశించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
తనను కూడా అక్రమంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించారని, చివరకు ఒక్క ఆధారాన్ని కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టుకు ఇప్పటి వరకు సమర్పించ లేక పోయాయని ఆరోపించారు. తాను నిర్దోషినని తనకు తెలుసన్నారు. తనకు మధ్యంతర బెయిల్ వస్తుందని మోడీ, అమిత్ షా అనుకోని ఉండరని ఎద్దేవా చేశారు. కానీ చివరకు న్యాయమే గెలుస్తుందని తన విడుదలతో తేలి పోయిందన్నారు.
ఇప్పటి దాకా తమ ఇంట్లో , ఆఫీసులో చేపట్టిన సోదాలలో ఒక్కటైనా ఆధారం దొరికిందా అని ప్రశ్నించారు మనీష్ సిసోడియా. త్వరలోనే తమ నాయకుడు, సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.