సోని పదవీ కాలం వివాదాల మయం
ప్రధానమంత్రి మోడీకి అత్యంత ఆప్తుడు
న్యూఢిల్లీ – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొలువు తీరాక తనకు ఆప్తులు అనుకున్న వారికి అందలం ఎక్కించారన్న ఆరోపణలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ సర్కార్ హయాంలో స్కామ్ లు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే యూజీసీ పరీక్షలను రద్దు చేసింది. మరో వైపు సుప్రీంకోర్టులో ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ 2024 పరీక్ష స్కామ్ కు సంబంధించి కేసు నడుస్తోంది. మరో వైపు దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వెంట్లను అందించే సంస్థగా పేరు పొందిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి సైతం అక్రమాల జాడ్యం అంటుకోవడం విస్తు పోయేలా చేసింది.
తాజాగా యూపీఎస్సీ చైర్ పర్సన్ గా ఉన్న మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేశారు. ఈయన ఎవరో కాదు ప్రధానమంత్రి మోడీకి అత్యంత ఆప్తుడు. ఆయన నియామకంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇంకా 5 ఏళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ముందుగానే పదవి నుంచి తప్పుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే ఆయన తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించారు. కొత్తగా ఎవరిని నియమిస్తారనేది ఉత్కంఠ నెలకొంది.
ఇక మనోజ్ సోనీ 40 ఏళ్‌ల వయసులో 2005లో ఎంఎస్ యూనివర్శిటీకి వీసీగా ఎంపికయ్యారు. దేశంలోనే అత్యంత పిన్న వయసు కలిగిన వీసగా పేరు పొందారు. జూన్ 2017లో యూపీఎస్సీ చైర్ పర్సన్ గా ఎంపికయ్యే కంటే ముందు గుజరాత్ లోని రెండు యూనివర్శిటీలకు మూడు సార్లు వైస్ ఛాన్స్ లర్ పదవిని అలంకరించారు.
2015 దాకా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీకి వీసీగా రెండు సార్లు పని చేశారు. ఇదిలా ఉండగా ట్రైనీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి పూజా ఖేద్కర్ నకిలీ గుర్తింపు పత్రాలను సృష్టించి సర్వీస్ లో చేరినట్లు తేలి పోయింది.
ఇందుకు సంబంధించి ఆమె నకిలీ వైకల్య ధృవీకరణ పత్రాన్ని సమర్పించిన వివాదం ముదిరి పాకాన పడింది. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీయడంతో యూపీఎస్సీ ఆమెపై కేసు నమోదు చేసింది. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేందుకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. ఇదిలా ఉండగా ఖేద్కర్ పై కేసు నమోదు తర్వాత సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంపికైన అభ్యర్థులపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ , బీసీలు, వైకల్యం కోసం రిజర్వ్ చేసిన ప్రయోజనాలను పొందేందుకు నకిలీ పత్రాలు సృష్టించారంటూ పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. మొత్తం సివిల్స్ ఎంపిక వ్యవహారంపై పెద్ద ఎత్తున నీలి నీడలు కమ్ముకున్నాయి.
యూపీఎస్సీ అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315-323 ప్రకారం తప్పనిసరి చేయబడిన ఒక రాజ్యాంగ సంస్థ. కమిషన్ కేంద్ర ప్రభుత్వం తరపున అనేక పరీక్షలను నిర్వహిస్తుంది. కమిషన్‌కు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు, 10 మంది సభ్యులు ఉండవచ్చు. ప్రస్తుతం గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ దినేష్ దాసాతో సహా చైర్ పర్సన్‌తో పాటు ఏడుగురు సభ్యులు ఉన్నారు. నీలి నీడలు కమ్ముకున్న యూపీఎస్సీకి ఎవరు చైర్ పర్సన్ గా నియమిస్తారనేది అనుమానాస్పదంగానే ఉంది.