రాజ ముద్ర మార్పుపై నిరసన
కేవలం జయ జయహే గీతం మాత్రమే
హైదరాబాద్ – రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇప్పటికే గత ప్రభుత్వం తయారు చేసిన అధికార లోగో (రాజ ముద్ర)లో మార్పులు చేస్తామని ప్రకటించారు. కాకతీయ కళా తోరణం కాకుండా చరిత్రలో నిలిచి పోయిన సమ్మక్క సారలమ్మలను చేరుస్తామని తెలిపారు.
అంతే కాకుండా గత వైభవానికి చిహ్నంగా, తెలంగాణ ప్రాంతానికి, ప్రత్యేకించి హైదరాబాద్ నగరానికి మకుటాయ మానంగా నిలిచిన చార్మినార్ రాజ ముద్ర నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. అనాలోచిత నిర్ణయాలు తీసుకుని అభాసు పాలు కావద్దంటూ పలువురు సూచించారు.
కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. దీంతో ప్రభుత్వం జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కేవలం రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ గేయాన్ని మాత్రమే అధికారిక గీతంగా ప్రకటిస్తారని తెలిపింది.