ప్రకటించిన హొం మంత్రి వంగలపూడి అనిత
అమరావతి – మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ లో మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు హోం మంత్రి వంగలపూడి అనిత. అసంపూర్తిగా ఉన్న మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పనులు చకచకా సాగుతున్నట్లు చెప్పారు. ఏపీలో శాంతి భద్రతల సమస్యే లేలే లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 మెరైన్ పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయని వెల్లడించారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే 3 మెరైన్ పీఎస్ లు ఉన్నాయని తెలిపారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అడుగడుగునా వైఫల్యం కనిపించిందన్నారు. ఫిషింగ్ హార్బర్ లో బోట్లు నడవని పరిస్థితి నెలకొందన్నారు. ఏపీలో కూటమి సర్కార్ వచ్చాక సీన్ మారిందన్నారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేలా రక్షణ చర్యలు చేపడతామని అన్నారు.
మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు వంగలపూడి అనిత. పర్యాటకులు ప్రమాదాల బారిన పడకుండా, పడినా కాపాడుకునేలా గజ ఈతగాళ్లను తర్ఫీదునిచ్చి ఏర్పాటు చేస్తామన్నారు. మెరైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గస్తీకి కావల్సిన బోట్ల వంటి సదుపాయాలు సమకూరుస్తామన్నారు మంత్రి వంగలపూడి అనిత. నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న మత్స్యకారులను ఆదుకుంటామన్నారు. విపత్తునిర్వహణ సంస్థ ద్వారా శిక్షణనిచ్చి ఆపదమిత్రలుగా నియమించడానికి కృషి చేస్తమన్నారు. మెరైన్ పోలీస్ స్టేషన్, ఔట్ పోలీస్ స్టేషన్ ల సామర్థ్యం పెంచుతామన్నారు. కశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఏపీలో నిఘా వ్యవస్థను అప్రమత్తం చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఏపీలోనూ పోలీసులు గట్టిగా అమలు చేస్తున్నారన్నారు. భద్రతకు లోటు లేకుండా పటిష్ట తనిఖీలు నిర్వహించి జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.