ఘటనా స్థలాన్ని సందర్శించిన సీఎం యోగి
ఉత్తర ప్రదేశ్ – యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్ -19లోని భక్తుల శిబిరంలో రెండు సిలిండర్లు పేలాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 30 టెంట్లు దగ్ధం కావడంతో మంటలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి. భయంతో భక్తులు పరుగులు తీశారు. మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేశారు. ఘటనా స్థలాన్ని సీఎం యోగి ఆదిత్యానాథ్ సందర్శించారు.
మహా కుంభ్ లో దాదాపు 100 గుడారాలకు మంటలు అంటుకున్నాయి, ప్రధానమంత్రి మోదీ యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేశారు. అగ్ని ప్రమాదం గురించి ఆరా తీశారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా వేదిక వద్ద ఇప్పటికే నిలిపి ఉంచిన ట్రక్కులు ప్రభావిత ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పాయి.
కాగా ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించ లేదని పోలీసులు స్పష్టం చేశారు. చుట్టు పక్కల గుడారాలలో నివసిస్తున్న ప్రజలను భద్రత కోసం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జనవరి 13న ప్రారంభమైన కుంభ మేళా ఫిబ్రవరి 26 దాకా కొనసాగుతుంది. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 7.72 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానం చేశారు.