మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్ తో భేటీ
దావోస్ – దావోస్ ఎకనామిక్ ఫోరంలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ బిజినెస్ ఫౌండర్ ప్రెసిడెంట్, మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్ తో మంత్రి భేటీ అయ్యారు. ఏపీలో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా దక్షిణాదిలో మాస్టర్ కార్డ్ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉందన్నారు. మాస్టర్ కార్డ్ కంపెనీ ప్రాధాన్యత అయిన ఫిన్ టెక్‌కు అనుగుణంగా ఐటి వర్క్ ఫోర్స్‌ను తయారు చేయడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.
మాస్టర్ కార్డు హెల్త్ కేర్ మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్ మాట్లాడుతూ… తమ బోర్డు సభ్యులతో చర్చించి, ఏపీలో కార్యకలాపాల విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలను తగ్గించి, వాతావరణంలో ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి క్లీన్ ఎనర్జీ ఒక్కటే ఏకైక పరిష్కార మార్గమని మంత్రి నారా లోకేష్ అన్నారు.
“పర్యావరణ పరిరక్షణ – వాతావరణ ఉద్యమ భవిష్యత్” అనే అంశంపై స్వనీతి ఆధ్వర్యాన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్వనీతి ఇనిషియేటివ్ సిఇఓ రిత్వికా భట్టాచార్య వ్యాఖ్యాతగా వ్యవహరించగా, జోర్డాన్ క్వీన్ డాక్టర్ రానియా అల్ అబ్దుల్లా, పోర్చుగల్ మాజీ ప్రధాని జోస్ మాన్యుల్ బరాసో, యునెస్కాప్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ మార్గా గ్యుయల్ సోలెర్, సెడ్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వికాస్ మెహతా, ఇండోనేషియా జాతీయాభివృద్ధి మంత్రి రచ్మట్ పంబుడి, ఇండికా ఎనర్జీ ప్రెసిడెంట్ డైరక్టర్ అర్సాద్ రజీద్, రెన్యు పవర్ జింక్ సిఇఓ వైశాలి నిగమ్ సిన్హా పాల్గొన్నారు.
గ్రీన్ ఎనర్జీ ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, ఏపీని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు నారా లోకేష్.