కాంగ్రెస్ దళిత వ్యతిరేక పార్టీ – మాయావతి
అంబేద్కర్ అంటే ఆ పార్టీకి గిట్టదని ఫైర్
ఉత్తర ప్రదేశ్ – బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ , యూపీ మాజీ సీఎం కుమారి మాయావతి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మాయావతి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ దళితులు, బహుజనుల గురించి పట్టించు కోలేదని ఆరోపించారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఆ పార్టీ దళితుల జపం చేస్తుందని మండిపడ్డారు మాయావతి.
కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దళిత వ్యతిరేక పార్టీ అని ధ్వజమెత్తారు. తమ పార్టీ ఏనాడూ కూడా సమాజ్ వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్నారు కుమారి మాయావతి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాక ముందు యూపీఏ సర్కార్ కొలువు తీరిందని, ఆనాడు ఎందుకు జాతీయ కుల గణను నిర్వహించ లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతోంది అంటూ మండిపడ్డారు మాయావతి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు .