డ్రోన్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు
ముగిసిన అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024
అమరావతి – ఏపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంగళగిరిలో నిర్వహించిన డ్రోన్ టెక్నాలజీ సదస్సు బుధవారం నాటితో విజయవంతంగా ముగిసింది. 5 వేలకు పైగా డ్రోన్లతో నిర్వహించిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఇదే సమయంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.
డ్రోన్ టెక్ నవ ఆవిష్కరణలకు ఈ సదస్సు గొప్ప ముందడుగు అని, వచ్చే అయిదేళ్లలో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని సదస్సులో పలువురు వక్తలు స్పష్టం చేశారు. సదస్సుతో డ్రోన్ మ్యానుఫ్యాక్చర్లలో విశ్వాసం ఇనుమడించిందని.. ఈ ఊపుతో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), డ్రోన్ యూజ్ కేసుల రూపకల్పన, వివిధ రంగాల్లో వినియోగం తదితరాల్లో గణనీయ అభివృద్ధి సాధ్యపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
యువ భారత్‌లో మేధస్సుకు కొదవ లేదని.. అయితే పెట్టుబడుల పరంగా సవాళ్లు ఉన్నాయని.. వాటిని ఎదుర్కొనేలా, స్టార్టప్‌లను ప్రోత్సహించేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న భరోసా సదస్సు ద్వారా లభించిందని పేర్కొన్నారు.
తొలి రోజు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొనగా రెండో రోజు డ్రోన్ రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులతో కూడిన ప్యానళ్లు విస్తృతంగా చర్చించాయి. ఐఐటీ మద్రాస్ డిఫెన్స్ డ్రోన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ హెచ్ఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో వార్‌ఫేర్ విత్ ఇండీజినస్ డ్రోన్ అండ్ యాంటీ డ్రోన్ టెక్నాలజీస్‌పై ప్రభావవంతమైన చర్చ జరిగింది.
అదే విధంగా హంచ్ మొబిలిటీకి చెందిన అమిత్ దత్తా నేతృత్వంలో భారతీయ డ్రోన్ రంగంలో పెట్టుబడుల పరంగా సవాళ్లపై చర్చ జరగ్గా.. రెడ్వింగ్ ల్యాబ్స్ కో-ఫౌండర్ అన్షుల్ శర్మ ఆధ్వర్యంలో ఆరోగ్య రంగంలో ఏరియల్ మెడికల్ సపోర్ట్, డ్రోన్ అంబులెన్సులు తదితరాలపై చర్చ జరిగింది.
రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె.నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డా. జి.లక్ష్మీశ చర్చల్లో పాల్గొన్నారు. డ్రోన్ టెక్నాలజీస్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేర వేయడంలో, డ్రోన్ సాంకేతికతల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
స్టార్టప్‌లకు ఫండింగ్‌కు సంబంధించి అమలవుతున్న విధానాలను వివరించారు. అదే విధంగా మారుమూల గ్రామాల ప్రజలు, గిరిజన ప్రాంతాల ప్రజలకు సైతం నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో డ్రోన్ సాంకేతికతల అనుసంధాన సాధ్యాసాధ్యాలపైనా చర్చించారు.
డిజిటల్ భూ రికార్డుల రూపకల్పనలో డ్రోన్ సాంకేతికత వినియోగంపై ప్రకాశం జిల్లా జేసీ రోణంకి గోపాలకృష్ణ కీలక ప్రసంగం చేశారు. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ స్మిత్ షా నేతృత్వంలో డ్రోన్ రంగానికి అవసరమైన నైపుణ్యవంతులైన మానవ వనరుల అభివృద్ధిపై చర్చ జరిగింది.
ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఛైర్మన్, ఎండీ కె.దినేష్ కుమార్.. ఇటీవల విజయవాడ వరదల సమయంలో బాధితులకు ప్రభుత్వం అందించే సహాయక చర్యల్లో డ్రోన్ల వినియోగం విజయవంతం కావడంపై కీలక పీపీటీని ప్రజెంట్ చేశారు.
విపత్తుల నిర్వహణలో డ్రోన్ సాంకేతికతపై దార్శనికతను ఆవిష్కరించారు. వరద మ్యాపింగ్, పర్యవేక్షణ, ముంపు నష్టాల సత్వర అంచనా, ఆహారం, ఇతర సామగ్రి సరఫరా, పారిశుద్ధ్య కార్యకలాపాల్లో డ్రోన్లను వినియోగించిన తీరును వివరించారు. 437 డ్రోన్లు, 846 మంది సిబ్బంది, 4,073 ట్రిప్పుల ద్వారా ప్రజలకు అందించిన సేవలను వివరించారు.