Thursday, April 3, 2025
HomeNEWSమీడియా క‌మిష‌న్ ను ఏర్పాటు చేయాలి

మీడియా క‌మిష‌న్ ను ఏర్పాటు చేయాలి

ఎడిట‌ర్స్ గిల్డ్స్ పై జ‌స్టిస్ తీవ్ర ఆగ్ర‌హం

హైద‌రాబాద్ – ఇటీవల మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును ఎడిటర్‌ గిల్డ్స్‌ ఎలా ఖండిస్తుందని జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి ప్రశ్నించారు. ఆమె పెట్టి కంటెంట్‌ను పరిశీలించారా, మీడియాలో అలాంటి భాష వాడొచ్చా అని ప్రశ్నించారు. ప్రజా క్షేత్రంలో లేని ముఖ్యమంత్రి కుటుంబంలోని మహిళలను బండ బూతులు తిట్టడం స్వేచ్ఛ కిందికి రాదన్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్‌) ఆధ్వర్యంలో సోషల్‌ మీడియాలో వాడుతున్న భాష సమంజసమేనా అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. అభ్యంతరకర అంశాలపై విస్తృతంగా చర్చ కొనసాగింది.

ఈ సందర్భంగా జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో స్వీయ నియంత్రణ ఉండాలని అన్నారు. భావ ప్రకటనకు మాత్రమే స్వేచ్ఛ ఉంది తప్ప బూతుకు స్వేచ్ఛ లేదన్నారు. భిన్నంగా ఆలోచించేవారికి స్వేచ్ఛ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే అసభ్యంగా మాట్లాడటం ఏ సంస్కృతిలోనూ లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు.

మీడియాకు స్వేచ్ఛ ఉండాలిగానీ అది పరాకాష్టకు చేరి పరుష పదజాలాలకు దారి తీయరాదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమాల ద్వారా సమాజానికి ఉపయుక్తమయ్యే అంశాలు కూడా ఉన్నాయని, అయితే కొందరి వల్ల అది పక్కదారి పట్టి మీడియా విలువలను దిగజారుస్తోందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి నేతృత్వంలో మీడియా కమిషన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. విమర్శలు చేయడం తప్పుకాదుగానీ వ్యక్తిగత వ్యవహారాలను దూషించడం సరికాదన్నారు. జర్నలిజం అంటేనే ప్రశ్నించడం అని, అయితే జడ్జిమెంట్‌ మాత్రం ఇవ్వరాదని తెలిపారు.

ఆర్టికల్‌ 19 వాక్‌ స్వాతంత్య్రపు హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందన్నారు. ప్రధానంగా సిద్ధాంతాలను మాత్రమే విమర్శించాలి, విశ్లేషించాలని, ఒకరి ప్రతిష్టను దిగజార్చేలా నియంత్రణను కోల్పోరాదని అన్నారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలకు పరిష్కార మార్గాలు అన్వేషించాలన్నారు.

ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాను సరిగ్గా వాడకుంటే చివరకు మనకే ఇబ్బందులొస్తాయని హెచ్చరించారు. మీడియాలో స్వీయ నియంత్రణ, భాషా నియంత్రణ అవసరమని నొక్కిచెప్పారు. ఒకవేళ ప్రజలు ఆవేశంలో మాట్లాడినా వాటిని ఎడిట్‌ చేసి పోస్టింగ్‌ చేయాలని సూచించారు. సీపీఐ మాజీ శాసన సభా పక్షనేత చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎక్కువగా ఫేక్‌ న్యూస్‌ వేగంగా వ్యాపిస్తోందని, రాజకీయ నాయకుల నోళ్లనుంచి కూడా బూతు పురాణం వస్తోందని అన్నారు. నాగరిక సమాజంలో అనాగరిక భాష ఏంటని ప్రశ్నించారు. ఉన్మాదం ఎందుకు పెరుగుతోందనే చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో టిశాట్‌ సీఈఓ బి వేణుగోపాల్‌ రెడ్డి, జస్టిస్‌ చంద్రకుమార్‌, పీఓడబ్ల్యూ సంధ్య, మహిళా జర్నలిస్టు తులసీచంద్‌, కరుణాకర్‌ దేశాయ్‌, సొగరాబేగం, సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌ మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్‌, జస్ట్‌ యూనియన్‌ కన్వీనర్‌ రమణ, టీడబ్ల్యూజేఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బసవపున్నయ్య, రఫీ, ప్రకాశ్‌, టీయూజేఎస్‌ ప్రధాన కార్యదర్శి టి రమేష్‌ బాబు, ఉపాధ్యక్షులు పసునూరి రవీందర్‌, వివిధ సంస్థలకు చెందిన సీనియర్‌ జర్నలిస్టులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments