సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
రుణపడి ఉన్నానన్న మెగాస్టార్ చిరంజీవి
హైదరాబాద్ – ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా మంగళవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తన సినీ కెరీర్ లో సాధించిన విజయాలను ప్రాతిపదికగా చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పేరు పొందిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు కల్పించినందుకు, తనకు సర్టిఫికెట్, షీల్డ్ ను బహూకరించినందుకు సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదే సమయంలో అత్యంత సామాన్యమైన కుటుంబం నుంచి, ఎక్కడో ఏపీలోని మూరుమూల పల్లె మొగల్తూరు నుంచి వచ్చిన తనకు ముందు నుంచి ఇప్పటి దాకా వెన్నంటి ఉన్న వారికి, తనకు మద్దతుగా నిలిచిన వారికి, హితులు, సన్నిహితులు, అభిమానులు, కుటుంబీకులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి.
అంతే కాకుండా నాతో చిత్రాలు నిర్మించిన నిర్మాతలకి, నన్ను నడిపించిన దర్శకులకి, అద్భుతమైన పాటలు ఇచ్చిన సంగీత దర్శకులకి, ఇన్ని విభిన్నమైన స్టెప్పులు వేయించి, నన్ను గొప్ప డ్యాన్సర్ గా తీర్చి దిద్దిన కొరియో గ్రాఫర్లకు పేరు పేరునా థ్యాంక్స్ తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు చిరంజీవి.