దేశం గర్వించదగిన నేత
మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి
హైదరాబాద్ – మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి. మన దేశం ఇప్పటివరకు సృష్టించిన గొప్ప రాజనీతిజ్ఞులలో ఒకరు అని పేర్కొన్నారు. అత్యున్నతమైన వ్యక్తిత్వం కలిగిన అరుదైన రాజకీయ నాయకుడు అని కొనియాడారు. ఆయనతో తనకు ఉన్న బంధం గొప్పదన్నారు. మరోసారి ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని తనను చూసి నేర్చుకున్నానని తెలిపారు చిరంజీవి. ఇలాంటి నాయకులు రాజకీయాలలో అరుదుగా ఉంటారని అన్నారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన సేవలు ఎల్లప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటాయని స్పష్టం చేశారు.
రాజకీయాలలోకి రావాలని అనుకునే వారికి మన్మోహన్ సింగ్ ఒక పాఠంగా మిగిలి పోతారని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన లాంటి మహానుభావుడి హయాంలో పార్లమెంటు సభ్యుడిగా, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
తనకు ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నానని తెలిపారు చిరంజీవి.