డబుల్ డెక్కర్ విధానం అమలు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం, విజయవాడ నగరాలలో మెట్రో ప్రాజెక్టును అమలు చేయాలని సంకల్పించారు. డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ట్రైన్ అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. రెండు నగరాలలో 25 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు సీఎం.
ఇందులో భాగంగా విశాపట్నంలో మొదటి స్టేజ్ కింద మధురవాడ నుంచి తాడిచెట్ల పాలెం దాకా 15 కిలోమీటర్ల మేర, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కి.మీ మేర డబుల్ డెక్కర్ మోడల్ లో మెట్రో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు నారా చంద్రబాబు నాయుడు.
ఇక విజయవాడ నగరంలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కి.మీ మేర డబుల్ డెక్కర్ నిర్మించనున్నట్లు తెలిపారు. 2017లో ప్రభుత్వం తీసుకున్న మెట్రో పాలసీ ఆధారంగా ఫండింగ్ మోడల్ పై చర్చించడం జరిగిందని చెప్పారు సీఎం. మెట్రో ప్రాజెక్టు అమలు తీరుపై తన అధ్యక్షతన సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఈ విషయాన్ని వెల్లడించారు.