ఎట్టకేలకు బోణీ కొట్టిన ముంబై
ఢిల్లీపై గ్రాండ్ విక్టరీ
ముంబై – ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ఇప్పటి వరకు వరుస పరాజయాలతో తీవ్ర విమర్శల పాలైన ముంబై జట్టు ఎట్టకేలకు గెలుపొందడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. జట్టు సమిష్టిగా రాణించడంతో ఇది సాధ్యమైంది.
వాంఖడే స్టేడియంలో భారీగా పరుగుల వరద పారించాయి ఇరు జట్లు. ముందుగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 235 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. అనంతరం మైదానంలోకి వచ్చిన ఢిల్లీ జట్టు 8 వికెట్లు కోల్పోయి కేవలం 205 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఢిల్లీ టీంలో మరోసారి మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు స్టబ్స్ . 25 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 7 సిక్సర్లతో రెచ్చి పోయాడు. ఒకానొక దశలో ముంబైకి చుక్కలు చూపించాడు. 71 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. అయినా జట్టును గెలిపించ లేక పోయాడు. అంతకు ముందు పృథ్వీ షా 66 రన్స్ చేస్తే పోరెల్ 41 పరుగులు చేశారు. కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి నిరాశ పరిచాడు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ముంబై జట్టులో రోహిత్ 27 బంతుల్లో 49 రన్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు ఒక సిక్స్ ఉంది. కిషన్ 42 రన్స్ చేస్తే పాండ్యా 39 పరుగులతో రాణించాడు. ఇక టిమ్ డేవిడ్ ధాటిగా ఆడాడు. 45 రన్స్ చేశాడు. ఆఖరి ఓవర్ లో రెచ్చి పోయాడు రొమారియో . 10 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లు కొట్టాడు. 39 రన్స్ చేశాడు.