ఆర్సీబీ పరాజయ పరంపర
పేలవమైన ఆట తీరుతో పరేషాన్
ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన కీలక పోరులో మరోసారి చేతులెత్తేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటి దాకా మిగతా జట్లు దూసుకు పోతుంటే ఆర్సీబీ మాత్రం నత్త నడకన సాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ ఓడి పోయింది. అందరినీ విస్తు పోయేలా చేసింది.
కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తుందా అన్న అనుమానం కలుగుతోంది ఆ జట్టు ఆట తీరు చూస్తుంటే. రన్ మెషీన్ , స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఇక తాజాగా ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో మరోసారి తన పేలవమైన ఆట తీరుతో నిరాశ పరిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 197 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. అనంతరం బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ దుమ్ము రేపింది. కేవలం 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. తనకు ఎదురే లేదని చాటింది. ఆ జట్టు కూడా పరాజయాల నుంచి గట్టెక్కింది. విజయపు బాట పట్టింది.
ఇండియన్ డివిలియర్స్ గా పేరొందిన సూర్య కుమార్ యాదవ్ 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక ఇషాన్ కిషాన్ తానేమీ తీసిపోనంటూ దుమ్ము రేపాడు. 23 బంతుల్లో హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. మొత్తంగా ఆర్బీబీకి ఇది వరుసగా ఐదో ఓటమి కావడం గమనార్హం.