పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు
హైదరాబాద్ – పాకిస్తాన్ కు వ్యతిరేకంగా భారత దేశంకు మద్దతుగా పెద్ద ఎత్తున ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో ఉగ్రవాదులు 26 మందిని హతమార్చడంపై నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఓల్డ్ సిటీలో నమాజ్ కు హాజరయ్యారు. అనంతరం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇండియా జిందాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ మండిపడ్డారు. మేమంతా భారతీయులమని, ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమన్నారు.
ఇదిలా ఉండగా శుక్రవారం జుమా మసీద్ వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు ముస్లింలు. ఈ సందర్బంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడారు. పుట్టుకతో ముస్లింలం అయినప్పటికీ తామంతా భారతీయులమని స్పష్టం చేశారు. ఇంటెలిజెన్సీ వైఫల్యం వల్లనే ఘటన చోటు చేసుకుందని, కానీ ఉగ్రవాదులు ఇలా చంపడం దారుణమన్నారు. ఎంఐఎంతో పాటు ప్రతి ముస్లిం భారతీయుడు ఈ అమానవీయ ఘటనను ఖండిస్తున్నారని చెప్పారు. అందుకే భారత్ చేస్తున్న యుద్దానికి తాము మనస్పూర్తిగా మద్దతు తెలియ చేస్తున్నామని అన్నారు. పాకిస్తాన్ ఇలాంటి చిల్లర పనులు మానుకోవాలని సూచించారు ఓవైసీ.