ప్రతిపాదించిన మంత్రి అనిత
అమరావతి – హోంశాఖకు నిధుల గురించి హోం మంత్రి అనిత ప్రతిపాదించారు. 10వ డిమాండ్ కింద హోంశాఖకు రూ.8570.50 కోట్లు 2025-26 ఏడాదికిగానూ ఇవ్వాలని కోరారు. పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని కోరారు ఎమ్మెల్యేలు కాల్వశ్రీనివాసులు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, విష్ణుకుమార్ రాజు, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్లే ప్రజలు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఓట్లేశారని అన్నారు. సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సహా ప్రతి ఒక్కరిపైనా గత ప్రభుత్వంలో అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు అనిత.
దళితరాలినై యుండి కడపలో జడ్జి ముందు అట్రాసిటీ కేసులో నిలబడేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి. కోవిడ్ సమయంలో మాస్కుల కొరతపై ప్రశ్నిస్తే డాక్టర్ సుధాకర్ ని హింసించి చంపారని వాపోయారు. డాక్టర్ అనితరాణి అనే అమ్మాయిని ఇబ్బందులు పెట్టారని అన్నారు. సీపీఎస్ రద్దుపై ప్రశ్నించిన పాపానికి ఉద్యోగులపై కేసులు పెట్టారని ఆరోపించారు. అమరావతి రాజధాని కావాలని నిరసన తెలిపినందుకు మహిళలని చూడకుండా బూటు కాలితో తన్నించారని చెప్పారు వంగలపూడి అనిత.
తప్పు అంటే వేధింపులు, ప్రశ్నిస్తే కేసులు నమోదు చేశారంటూ మండిపడ్డారు. అమరావతి విజిట్ కి బస్సుయాత్ర చేస్తుంటే చంద్రబాబుపై రాళ్లు వేయించారని అన్నారు. పోలీస్ వ్యవస్థను ఐదేళ్లలోనే అన్నిరకాలుగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు.రూ.12 కోట్లు సీసీ కెమెరాలకు సంబంధించిన బకాయిలు చెల్లించ లేదన్నారు. నేరం జరిగితే నేరస్థుడు ఎట్టి పరిస్థితులలో తప్పించు కోకూడదనే తమ విధానమన్నారు. లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే 50 వేలను ఏర్పాటు చేశామన్నారు.