హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత
అమరావతి – పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేస్తామని అన్నారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. అనకాపల్లి జిల్లాలో జరిగిన మినీ మహానాడులో పాల్గొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు తనకు భారీ మెజారిటీ ఇచ్చారని, వారి రుణం తీర్చుకోలేనని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. గత ఐదు సంవత్సరాలలో పాయకరావుపేటలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం రెండూ సమాంతరంగా నడుస్తున్నాయి అని తెలిపారు.
బల్క్ డ్రగ్ పార్క్, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. పాయకరావుపేట అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అని చెప్పారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరగాల్సిందే అంటూ పార్టీ పట్ల నిబద్ధతను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చూసి ప్రతి నాయకుడు ఎంతో నేర్చుకోవాలి అంటూ పిలుపునిచ్చారు వంగలపూడి అనిత. ప్రజలు ఇటీవల చూపిన ‘సినిమా’ ఆయనకు బుద్ధి చెప్పే విధంగా ఉంది అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గంలో ఉత్తమ సేవలందించిన నాయకులను, కార్యకర్తలను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యేలు, టిడిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు.