హెచ్చరించిన మంత్రి వంగలపూడి అనిత
అమరావతి – ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు మంత్రి వంగలపూడి అనిత. అసెంబ్లీ లో హెల్మెట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. హెల్మెట్ ధరించక పోవడం కారణంగా ఎంతో మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన చెందారు. తల్లిదండ్రులకు కడుపు శోకం మిగిల్చారని వాపోయారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని హెచ్చరించారు. తమ ప్రభుత్వం హెల్మెట్ ధరించడానికి సంబంధించి సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
అందుకే హెల్మెట్ ధరించక పోతే రూ. 1000 జరిమానా విధిస్తున్నామని అన్నారు. ప్రాణమా లేక వెయ్యి రూపాయాల అన్న దానిపై ప్రజలు ఆలోచించాలని స్పష్టం చేశారు. పౌరుల్లో మార్పు వచ్చేందుకు రూ. 100 నుంచి వెయ్యికి పెంచడం జరిగిందన్నారు. అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అజాగ్రత్తల వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు వంగలపూడి అనిత. హెల్మెట్ విషయంలో కఠినంగా వ్యవహరించక పోతే ఇంకా చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.