హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత
అమరావతి – త్వరలోనే రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి వంగలపూడి అనిత. టెక్నాలజీలో చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. పోలీస్, అగ్నిమాపక సేవలు, జైళ్లు, విపత్తు నిర్వహణ, జిల్లా సైనిక సంక్షేమానికి సంబంధించిన కేంద్ర పథకాల నిధులు రావాల్సి ఉందన్నారు.
సోమవారం హోంశాఖ మంత్రి అధ్యక్షతన సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కూడా ఈ కీలక మీటింగ్ లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన బకాయిలు, నిధుల గురించి ప్రత్యేకంగా చర్చ జరిగింది.
టెక్నాలజీ పెరుగుతూ నేర స్వరూపం మార్చుకుంటోన్న నేపథ్యంలో పోలీసులకు తగిన శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై సమాలోచనలు చేస్తున్నామన్నారు అనిత వంగలపూడి.
హాజరైన హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి , ఐజీ విజయకుమార్, ‘ఈగల్’ చీఫ్ ఆకే రవికృష్ణ, ఎస్పీ ఎస్ఐబీ, గీతాదేవి, జైళ్ల శాఖ అడిషనల్ ఎస్పీ రఘు, డీజీ ఫైర్ మాదిరెడ్డి ప్రతాప్, విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్, రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ బ్రిగేడైర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.